||సుందరకాండ ||

||నలభై ఒకటవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
స చ వాగ్భిః ప్రశస్తాభిః గమిష్యన్ పూజితస్తయా|
తస్మాద్దేశాదపక్రమ్య చింతయామాస వానరః||1||

స|| సః వానరః ప్రశస్థాభిః వాగ్భిః పూజితః తస్మాత్ దేశాత్ అపక్రమ్య గమిష్యన్ చింతయామాస||

ఆ వానరుడు మాటలతో ప్రశంశించబడి పూజింపబడి ఆదేశమునుండి బయలుదేరి వెళ్ళుటకు అలోచించెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకచత్వారింశస్సర్గః

ఆ వానరుడు ఆ దేవి మాటలతో ప్రశంశించబడి పూజింపబడి ఆ దేశమునుండి తిరిగి బయలుదేరి వెళ్ళుటకు అలోచించెను.

'ఈ అశితేక్షణ చూడబడినది. ఇక్కడ ఒక చిన్నవిషయము మిగిలినది. మూడు ఉపాయములగు సామదాన భేదములను దాటి నాలుగో ఉపాయము దండన ఒకటి ఉన్నది. రాక్షసుల మీద సామము పనికిరాదు. ధనము ఉన్నవారు కనక దానము పనిచేయదు. బలదర్పము గల వారి మధ్యలో భేదోపాయమునకు తావులేదు. ఇక్కడ నాపరాక్రమమే పనికివచ్చును. ఇక్కడ ఉన్న పరిస్థితిలో పరాక్రమము వినా మరేది పనిచేయదు. ఇక్కడ రణములో చంపబడిన రాక్షసులు వలన మిగిలినవారు మెత్తబడెదరు'.

'ఇవ్వబడిన కార్యము సాధించినవాడు, సాధించిన కార్యము చెడకుండా ఎవడు అనేక ఇతర కార్యములు సాధించగలడో అట్టివాడు సాధకుడు అనబడును. ఇక్కడ చిన్నపని చేయవలను అన్నా ఉపాయము ఒకటే కాదు. ఈ మాట తెలిసినవాడే సమర్థుడు".

'నేను ఇక్కడనుంచి వారి బలాబలములు విశేష తత్త్వములను ఎరిగిన పిమ్మట వానరాధిపతి ఆలయమునకు వెడితే, అది నా ప్రభువు ఆదేశమును పూర్తిగా చేసినవాడను అగుదును".

'ఈ దినమున యుద్ధము జరుగుటకు రాక్షసులను ఎట్లు పురిగొల్పగలను? అప్పుడు అ దశాననుడు తన బలములను నన్ను ఎదురుకొనుటకు పంపును. అప్పుడు మంత్రివర్గముతో కూడిన రావణ సైన్యమును రణములో ఎదురుకొని అతని హృదయములో ఉన్నఆశను బలమును తెలిసికొని నేను ఇక్కడనుంచి సుఖముగ వెళ్ళిపోవచ్చును'.

'నందనోద్యానముతో సమానముగా వున్న దుష్టుడి ఉత్తమ వనము, చూడడానికి అందముగా నున్న అనేక మైన వృక్షములతో కూడిఉన్నది. శుష్కమైన వనమును అగ్ని దహించినటుల, ఈ వనమును భగ్నము చెసెదను. ఈ వనము భగ్నము అయినచో దశాననుడికి కోపము వచ్చును'.

'అప్పుడు ఆ రాక్షసాధిపుడు అశ్వములు మహారథములు కల త్రిశూలములు పట్టిశములు మున్నగు ఆయుధములు గల బలములను పంపించును. అప్పుడు మహత్తరమైన యుద్ధము అవును. నేను కూడా అ చండ పరాక్రమము గల రాక్షసులతో యుద్ధముచేసి అ దురాక్రముడగు రావణుని బలములను హతమార్చి సుఖముగా వానరాధిపతి వద్దకు పోయెదను'.

అప్పుడు అమిత పరాక్రమము గల మారుతి, ఈ విధముగా ఆలోచించి కోపముతో వాయువేగముతో తన తొడలబలముతో వృక్షములను పడగొట్టసాగెను. అప్పుడు ఆ వీరుడు అగు హనుమంతుడు మదించిన పక్షుల కిలకిలారావములతో నిండిన అనేకమైన వృక్షములతో కూడిన ప్రమదావనమును ధ్వంసము చేసెను'.

ఆ వనము పడగొట్టబడిన వృక్షములతో ధ్వంసము చేయబడిన సలిలాశయములతో, చూర్ణము చేయబడిన శిఖరములుగల పర్వతముతో వికృత స్వరూపము ధరించెను. వాడిపోయిన చిగుళ్ళుకల, ధ్వంసము చేయబడిన వృక్షములతో కల, ఆ వనము అనేకమైన పక్షుల ధ్వనులతో, ధ్వంసము చేయబడిన తామ్రపూవులతో నిండిన జలాశయములతో, దావానలముచేత దగ్ధమైన అరణ్యము వలె నుండెను.

ఆ అరణ్యములోని లతలు భయపడిన స్త్రీలవలె కానవచ్చెను. మహత్తరమైన ఆ వనము, నాశనము చేయబడిన లతా గృహములతో, చిత్రగృహములతో, మహత్తరమైన చితకగొట్టబడిన పాములతో జంతువులతో, విరిగిన శిలాగృహములతో శిథిలమైపోయెను.

కపి బలముతో నాశనమైన ఆ దశాననుని స్త్రీల ప్రమదావనములోని లతలు తమ విధిని తలచుకొని దుఃఖిస్తున్నవా అన్నట్లు, అధారము లేకుండా వేలాడుతున్నాయి.

ఆ మహాకపి ఆ లంకాధిపతి మనస్సును క్షోభించునట్లు చేసి, అనేకమంది రాక్షసులతో ఒంటరిగా యుద్ధము చేయగోరి ఉత్సాహముతో ప్రజ్వరిల్లుచూ ఆ వనము యొక్క తోరణద్వారము ఎక్కి కూర్చునెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఒకటవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

స తస్య కృతార్థపతేర్మహాకపిః మహద్వ్యళీకం మనసో మహాత్మనః|
యుయుత్సురేకో బహుభిః మహాబలైః శ్రియా జ్వలన్ తోరణమాస్థితః కపిః||21||

స|| సః మహాకపిః మహాత్మనః తస్య అర్థపతేః మనసః మహత్ వ్యలీకం కృత్వా మహాబలైః బహుభిః ఏకః యుయుత్సుః శ్రియాజ్వలన్ తోరణమ్ ఆస్థితః||

ఆ మహాకపి ఆ లంకాధిపతి మనస్సును క్షోభించునట్లు చేసి, అనేకమంది రాక్షసులతో ఒంటరిగా యుద్ధము చేయగోరి ఉత్సాహముతో ప్రజ్వరిల్లుచూ ఆ వనము యొక్క తోరణద్వారము ఎక్కి కూర్చునెను.
||ఓమ్ తత్ సత్||